వరల్డ్ కప్ మీద కాలేసిన మిచెల్ మార్ష్‌పై కేసు నమోదు

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అది కూడా ఎక్కడో కాదు మనదేశంలోనే. యూపీలోని అలీఘర్‍కు చెందిన పండిట్ కేశవ్ అనే ఆయన మిచెల్ మార్ష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు మిచెల్ మార్ష్ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అసలు విషయం ఏమిటంటే వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఇండియా మీద విజయం సాధించి ఆస్ట్రేలియా ప్రపంచకప్ కైవసం చేసుకుంది. ఆరోసారి ప్రపంచకప్ గెలుచుకున్న కంగారూలు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు.

అయితే ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో వరల్డ్ కప్ ట్రోఫీ మీద కాళ్లు ఉంచి మిచెల్ మార్ష్ ఇచ్చిన ఫోజు నెట్టింట వైరల్ అయ్యింది. ఓ చేతిలో బీరుబాటిల్ పట్టుకుని .. రెండుకాళ్లను వరల్డ్‌కప్ ట్రోఫీ మీద ఉంచి మార్ష్ ఇచ్చిన ఫోజు.. తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా ఇండియన్ ఫ్యాన్స్ మార్ష్ తీరును తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే అలీఘర్‍కు చెందిన పండిట్ కేశవ్ అనే ఆర్టీఐ కార్యకర్త మిచెల్ మార్ష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మిచెల్ మార్ష్ మీద పండిట్ కేశవ్ ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్‌లో లిఖిత పూర్వక ఫిర్యాదుచేశారు. ఈ వైరల్ ఫోటోతో సదరు క్రికెటర్ భారతీయ భావోద్వేగాలను కించపరిచారని అందులో పేర్కొన్నారు. వరల్డ్‌కప్ మీద కాళ్లు ఉంచడం ద్వారా ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని అవమానించటంతో పాటుగా 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని కూడా అవమానించారని కేశవ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ నేపథ్యంలో మిచెల్ మార్ష్ భారత్‍‍లో ఆడకుండా, అలాగే భారతదేశంపై కూడా ఎక్కడా ఆడుకుండా జీవితకాల నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ కంప్లైంట్ కాపీని ప్రధాని నరేంద్రమోదీ, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ కార్యాలయాలకు సైతం పంపించారు.

ప్రపంచకప్ ఆడిన మిచెల్ మార్ష్.. భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు మాత్రం దూరమయ్యాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ సహా మరికొందరు క్రికెటర్లు ప్రపంచకప్ ముగియగానే స్వదేశం చేరుకున్నారు. స్టీవ్ స్మిత్, ఇంగ్లిస్, స్టయినిస్, మ్యాక్స్‌వెల్ వంటి ప్లేయర్లు టీమిండియాతో టీ20 సిరీస్ ఆడుతున్నారు.


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *