SRHలో భారీ మార్పులు.. డేల్ స్టెయిన్ ఔట్.. కొత్త కెప్టెన్ ఎవరు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు షాక్ తగిలింది. గత రెండేళ్లుగా ఆ జట్టు బౌలింగ్ కోచ్‌ బాధ్యతల్లో ఉన్న డేల్ స్టెయిన్ లీగ్ నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ తెలిపింది. ఈ సీజన్‌ నుంచి విరామం కోరేందుకు డేల్ స్టెయిన్ ఇప్పటికే ఫ్రాంఛైజీ అనుమతి కోరినట్లు పేర్కొంది.

కాగా ఆటగాడిగా స్టెయిన్ తొలుత హైదరాబాద్‌కు (Sunrisers Hyderabad) చెందిన ఫ్రాంఛైజీ తరఫున ఆడాడు. డెక్కన్ ఛార్జర్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. కొన్ని రోజులు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా ఈ ప్రొటీస్ స్పీడ్ స్టర్ ఆడాడు. 2020 సీజన్‌లో చివరి సారిగా ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. 2022 సీజన్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్నాడు. జమ్ము కశ్మీర్ స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్ అంతర్జాతీయ పేసర్‌గా ఎదగడంలో డేల్ స్టెయిన్ కీలకపాత్ర పోషించాడు.

40 ఏళ్ల డేల్ స్టెయిన్ తన కెరీర్‌లో సౌతాఫ్రికా తరఫున 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. 95 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. కాగా వ్యక్తిగత కారణాలతోనే స్టెయిన్ ఈ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ సజావుగా సాగితే 2025 ఐపీఎల్ సీజన్‌లో తిరిగి సన్ రైజర్స్ కోచింగ్ బృందంలో చేరతాడని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక కొత్త బౌలింగ్ కోచ్‌ ఎంపిక కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

బౌలింగ్ కోచ్‌తో పాటు సన్‌రైజర్స్ జట్టు కొత్త కెప్టెన్ ఎంపికపై కూడా దృష్టి సారించింది. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న ఎయిడెన్ మార్‌క్రమ్‌ను తప్పించాలని ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం భావిస్తోంది. రాబోయే కొత్త సీజన్‌కు వన్డే ప్రపంచకప్ 2023 విన్నింగ్ కెప్టెన్, ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్‌ను నియమించే అవకాశం ఉంది. కాగా 2024 మినీ వేలంలో ప్యాట్ కమిన్స్‌ను హైదరాబాద్ భారీ ధరకు దక్కించుకుంది.

మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజ‌న్ షురూ కానుంది. హైద‌రాబాద్ జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్‌లో మార్చి 23వ తేదీన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో ఢీకొట్టనుంది.


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *