Warning: Undefined array key "steps" in /home/wordpress/doc_root/wp-content/plugins/amp/src/ReaderThemeSupportFeatures.php on line 501
Site icon Andhra News9

జైస్వాల్ ని చూసి నేర్చుకోండి.. తమ ఆటగాళ్లకు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ చురకలు

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. తమ బజ్‌బాల్ అప్రోచ్‌ను చూసి దూకుడుగా ఆడుతున్నాడని బెన్ డక్కెట్ చేసిన వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజిర్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. యశస్వి జైస్వాల్‌ ఇంగ్లండ్ ఆటను చూసి నేర్చుకోలేదని చురకలంటించాడు. పేదరికం జయించి ఒక్కో అడుగు ముందుకేస్తూ అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన యశస్వి జైస్వాల్‌ను చూసి ఇంగ్లండ్ ఆటగాళ్లు నేర్చుకోవాలని హితవు పలికాడు.

రాజ్‌కోట్ టెస్ట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. అయితే ఈ మ్యాచ్‌లో యశస్వి శతకం పూర్తి చేసిన తర్వాత డకెట్ మాట్లాడుతూ.. తమ బజ్‌బాల్ బ్యాటింగ్‌ అప్రోచ్‌ను ఇతర జట్లు కాపీ కొడుతున్నాయని, యశస్వి మా ఆట తీరుతోనే దూకుడుగా ఆడుతున్నాడని వ్యాఖ్యానించాడు. ఇది తమకు గర్వంగా ఉందని చెప్పాడు.

ఈ వ్యాఖ్యలపై నాజిర్ హుస్సెన్ ఘాటుగా స్పందించాడు. ‘యశస్విపై డకెట్ చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే అతను ఇంగ్లండ్‌ను చూసే దూకుడుగా ఆడుతున్నాడనే అర్థం వస్తోంది. వాస్తవం ఏంటంటే అతనికి ఇంగ్లండ్ ఏం నేర్పలేదు. జీవితంలో ఎదురైన సవాళ్లు, కష్ట నష్టాలతో పాటు ఐపీఎల్ నుంచి యశస్వి ఎంతో నేర్చుకున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. ఈ బజ్‌బాల్ యుగంలో ఇంగ్లండ్ మరింత మెరుగుపడాలంటే విమర్శలకు దూరంగా ఉండాలి. వీలైతే యశస్విని చూసి ఏమైనా నేర్చుకోండి.’అని నాజిర్ హుస్సెన్ చురకలంటించాడు.

రాజ్‌కోట్ టెస్ట్‌లో భారత్ 434 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. భారత్ విధించిన 557 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 122 పరుగులకే కుప్పకూలింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జడేజా(5/41) ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 430/4 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు కుప్పకూలింది. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1తో భారత్ ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ శుక్రవారం నుంచి రాంచీ వేదికగా ప్రారంభం కానుంది.

Exit mobile version