డల్లాస్‌లో మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా యోగా

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డల్లాస్‌లో జరిగిన యోగా శిక్షణ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమెరికాలోనే అతిపెద్ద మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద ఈ యోగాశిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ కాన్సుల్ జనరల్ అసీం మహాజన్‌కు మహాత్మా గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రపంచానికి భారత్ అందించిన యోగా కేవలం జూన్ 21నే కాకుండా నిత్యం అభ్యాసం చేయాల్సిన కార్యక్రమమని ఆయన అన్నారు.

యోగా వల్ల శరీరం, మనసు స్వాధీనంలో ఉంటాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అసీం మహాజన్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని, ప్రతి రోజూ యోగా చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలు చాలా ఉన్నాయని తెలిపారు.

ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు దినేష్ హూడా, బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, షబ్నం మోడ్గిల్, పలు సంస్థల సభ్యులు, ప్రవాస భారతీయులు, చిన్నారులు పాల్గొన్న ఈ యోగా కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన కార్యకర్తలు, శిక్షణ ఇచ్చిన యోగా మాస్టర్ విజయ్, ఐరిస్, ఆనందీలు, ముఖ్య అతిథి కాన్సల్ జనరల్ అసీం మహాజన్‌లకు మహాత్మా గాంధీ మెమోరియల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *