ఖలిస్థానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కటైన కాలిఫోర్నియాలోని భారతీయులు

ఖలిస్థాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా భారత్ ఐక్యత కోసం శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ కార్యాలయం ప్రాంగణంలో వందల మంది భారతీయ-అమెరికన్ మద్దతుదార్లు మార్చి 24న చేపట్టిన భారత అనుకూల ప్రదర్శనకు హాజరయ్యారు. ఖలిస్థాన్ మద్దతుదారుల బృందం మార్చి 19న శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని భారత కాన్సులేట్‌ కార్యాలయ అద్దాలను పాక్షికంగా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయులు శుక్రవారం భారత కాన్సులేట్‌ కార్యాలయ భవనం వద్ద సంఘీభావంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వందేమాతరం, భారతమాతకు జై నినాదాలు చేస్తూ పలు దేశభక్తి పాటలను వినిపించారు.

భారతీయ అమెరికన్లు శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు భారత కాన్సులేట్‌ వద్దకు చేరుకోగానే, అప్పటికే అక్కడ ఉన్న కొంతమంది ఖలిస్థాన్ మద్దతుదారులు భారత వ్యతిరేక నినాదాలు లంకించుకున్నారు. అయితే తగ్గేదిలేదంటూ భారతీయ అమెరికన్లు భారత్ అనుకూల నినాదాలు, డోలు వాయిద్యాలు, దేశభక్తి పాటలతో వారికి ధీటుగా సమాధానం చెప్పారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ప్రదర్శన, మాటల యుద్ధంలో వేర్పాటువాదులపై భారత మద్దతుదారులు పైచేయి సాధించారు. ఆదివారం హింసాత్మక సంఘటనలు జరిగిన నేపథ్యంలో శుక్రవారం అటువంటి సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున మోహరించి ఉండడం కనిపించింది.

భారత -అమెరికన్ కమ్యూనిటీ నిర్వహించిన శాంతి ర్యాలీలో శాక్రమెంటో నగరం నుంచి తెలుగు సంఘం తరపున రాఘవ్, మనోహర్, వెంకట్ ఇంకా పలువురు స్థానిక ప్రవాస తెలుగువారు హాజరయ్యారు. కాన్సులేట్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్, కాన్సుల్ ఆకున్ సబర్వాల్ సహా కార్యాలయ సిబ్బందిని కలుసుకుని తమ సంఘీభావం తెలియజేశారు. పలువురు భారత అనుకూల ముస్లింలు, సిక్కులు, ఇతర ప్రవాసులు పాల్గొన్న ఈ శాంతియుత ప్రదర్శనలో “భారతీయత” ప్రస్ఫుటంగా కనిపించింది.


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *