సౌదీలో చిక్కిన భారతీయుడు.. ఎందుకంటే..?

పవిత్ర మక్కా యాత్ర కోసం వెళ్లిన ఓ భారతీయ పర్యాటకుడు సౌదీ అరేబియాలో ( Saudi Arabia) చిక్కాడు. అందుకు కారణం అతని పేరు వాంటెడ్ క్రిమినల్ పేరుతో పోలి ఉండటమే. దాంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. తెలుగు ప్రవాస సంఘం (సాటా) అండగా నిలిచింది. జైలులో ఉన్న అతనికి బెయిల్ ఇప్పించింది. భారతదేశం (India) వెళ్లేందుకు మాత్రం అవకాశం లేకుండా పోయింది.

ఏం జరిగిందంటే.?

బెంగళూర్‌కు చెందిన మహ్మద్ గౌస్ కుటుంబ సభ్యులతో కలిసి సౌదీ అరేబియా వెళ్లాడు. అతని పేరు క్రిమినల్ పేరుతో పోలి ఉండటంతో జెద్దా ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమచారం ఇచ్చారు. 22 ఏళ్ల క్రితం జరిగిన నేరానికి సంబంధించి గాలిస్తోన్న నేరస్థుని వివరాలు గౌస్‌తో సరిపోలాయి. గౌస్‌ను నేరం జరిగిన ప్రదేశం అసీర్‌లో (అభా) గల అల్ జరీబ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇది జెద్దా నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. విషయం తెలుసుకున్న తెలుగు ప్రవాసీ సంఘం (సాటా) బాసటగా నిలిచింది. సాటా అధ్యక్షుడు మల్లేషన్ సూచనతో అభా అధ్యక్షుడు ప్రొఫెసర్ టి జయశంకర్ అండగా నిలిచారు. గౌస్‌కు భోజనం అందజేశారు. మేమున్నాం అని ధైర్యం ఇచ్చారు. తర్వాత అభాలో గల ప్రవాసీ సామాజిక కార్యకర్త అస్రఫ్ సాయంతో బెయిల్ మీద బయటకు తీసుకొచ్చాడు.

ఉమ్రా యాత్ర

బెయిల్ మీద బయటకు వచ్చిన గౌస్‌ను ఉమ్రా యాత్ర కోసం మక్కా పంపించారు. భారతదేశం వచ్చేందుకు అవకాశం మాత్రం లేదు. మోస్ట్ వాంటెడ్ లిస్ట్ నుంచి గౌస్ పేరు తొలగిస్తే తప్ప స్వదేశం వెళ్లేందుకు అవకాశం లేదు. భారతదేశం పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని జయశంకర్ వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రంలో గల సూర్యపేటకు చెందిన వారు. చాలా రోజుల నుంచి అభాలో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రవాస తెలుగు వారి సంక్షేమం, వసతి కోసం పనిచేస్తుంటారు.


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *