ఏపీలో ఎన్నికలకి ఇంకా పది నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒక వైపు నారా లోకేష్ యువగళం పాదయాత్రతో నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజల సమస్యల పై మాట్లాడుతూ వాటికి పరిష్కారాలు కూడా సూచిస్తూ ప్రజల్లో ఆదరణ పొందుతున్నాడు. మరోవైపు చంద్రబాబు నియోజకవర్గాల పర్యటనల్లో వివిధ హామీలు ఇస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నాడు. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వారిహితో రోడ్డెక్కాడు. ప్రజలకి, కార్యకర్తలకి చురకలు అంటిస్తూ తానూ హామీలు ఇస్తున్నాడు.
సీఎం జగన్ నవరత్నాలు అందిస్తామనే ప్రచారంతో గణ ఎన్నికల ముందు ప్రజల్లోకి పాదయాత్రగా వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రజలు జగన్ నవరత్నాల హామీని నమ్మి గెలిపించారు. అయితే నవరత్నాల హామీలో కొన్ని పథకాలు అసంపూర్ణంగా అమలయ్యాయి. మరికొన్ని మాత్రం అమలుకు నోచుకోలేదు. ఒకటి సంపూర్ణ మద్య నిషేధం, రెండోది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, మూడోది సిపిఎస్ రద్దు. మొదట్లో జాబ్ క్యాలెండర్ కింద వాలంటీర్ల జాబ్స్ ఇచ్చినా దాన్ని ప్రతి ఏడాది అమలు చేయలేకపోతున్నారు.
మద్య నిషేధం పక్కకు వెళ్లిపోయింది. బెల్ట్ షాపులు, ఊర్లలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. సంపూర్ణ మద్య నిషేధం అనేది అమలు కాకపోవడంతో మద్య నిషేధ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నా లక్ష్మారెడ్డి దీనిపై తీవ్ర నిరాశలో ఉన్నాడు అని తెలుస్తుంది. వీటిన్నింటిని పక్కన పెడితే ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో గెలిస్తే చంద్రబాబు నాయుడు కొన్ని హామీలను ఇస్తున్నారు. చంద్రబాబు రైతులకి సంవత్సరానికి రూ. 20 వేలు ఇస్తానని చెబుతున్నారు.
అమ్మఒడి పథకం ఇంటికి ఒకరికి జగన్ ఇస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఇంట్లో నలుగురు ఉన్నా ఇస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. చేయూత స్కీంల కింద 45 ఏళ్ల దాటినా వారికి సీఎం జగన్ పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఏకంగా 18 సంవత్సరాల నుంచే దీన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. ఇది అత్యంత కీలకమైన విషయం.
పవన్ కూడా వారాహి యాత్ర కొనసాగుతుంది. పవన్ షణ్ముక వ్యుహాంతో ముందుకు వెళతామని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ప్రతి నియోజకవర్గంలో 500 మందికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఇదే విధంగా చంద్రబాబు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పారు. అలాగే ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తామని ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలుచేయని జగన్ ఇప్పుడు కొత్తగా హామీలు ఇచ్చినా అమలు చేస్తారన్న నమ్మకం ప్రజల్లో లేదు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం అప్పుల మీద నడుస్తుందని తెలుసు. అప్పు పుట్టనిదే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. వచ్చేసారి జగన్ వస్తే కొత్త హామీల సంగతి దేవుడెరుగు.. అసలు సంక్షేమ పధకాలు అమలు అవుతాయన్న నమ్మకం ప్రజల్లో లేదు. దీంతో చంద్రబాబు ఇస్తున్న హామీలతో వైసీపీలో ఉక్కపోత మొదలైందని సమాచారం.

Leave a Reply