పవన్ పై ముద్రగడ ఫైర్ వెనుక అసలు కారణం ఇదేనా?

ముద్రగడ పద్మనాభం.. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనాలు సృష్టించిన పేరు. కాపు ఉద్యమ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నేత. అయితే అదంతా గతం. గత కొన్నేళ్లుగా అడపాదడపా మినహా పూర్వ స్థాయిలో కాపుల గొంతుకై మాట్లాడటం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా ఆయన మళ్లీ ఫేమస్ అయిపోయారు. ఆయనపై వరుస విమర్శలతో విరుచుకు పడుతూ లేఖాస్త్రాలు సంధిస్తున్నారు ముద్రగడ పద్మనాభం. ఇప్పటికే రెండు లేఖలు రాసిన ముద్రగడ యాత్ర పూర్తయ్యేలోపు మరికొన్ని సంధించడం ఖాయం అనే విశ్లేషణలు గట్టిగానే విపిస్తున్నాయి. అయితే ఈ లేఖల వెనుక ముద్రగడ అసలు ఆలోచన వేరే ఉంది అంటూ కౌంటర్లు కూడా అదే స్థాయిలో పేలుతున్నాయి.

ముద్రగడ పద్మనాభం గత కొన్నేళ్లుగా ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. టీడీపీతో అయితే ఉప్పునిప్పులా ఉంటున్నారు ఆయన. జనసేనతో గతంలో సంప్రదింపులు జరిగినా అవి వర్కౌవుట్ కాలేదని తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలు బాగా తెలిసిన వారు అంటుంటారు. అయితే వైసీపీ పై మాత్రం కాస్త మెతక ధోరణిలో ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. ఆ మధ్య జగన్ కి రెండు లేఖలు రాసినా ఏదో బతిమాలినట్టు ఉందే కానీ ఎక్కడా డిమాండ్ చేసినట్టు కనిపించలేదు.

వారాహి యాత్ర మొదలైన కత్తిపూడి నుంచే వైసీపీపై పవన్ వార్ సైరన్ మోగించారు. అయితే రెండు మూడు రోజులు సైలెంట్ గా ఉన్న ముద్రగడ ఒక్కసారిగా స్పీడ్ అందుకున్నారు. కాకినాడ నడిబొడ్డున స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని పవన్ విమర్శించడంతో ముద్రగడకు కోపం తన్నుకొచ్చిందని జనసేన విమర్శలు చేస్తోంది. ఈ విమర్శను రుజువు చేస్తూ తనకు ద్వారంపూడి ఫ్యామిలీకి సన్నిహిత సంబంధం ఉందని చెప్పేశారు. పనిలో పనిగా ద్వారంపూడి సవాల్ను కానీ తన సవాల్ను కానీ స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు ముద్రగడ. కాకినాడలో పోటీ చెయ్యాలని పవన్ను కౌంటర్ చెయ్యడాన్ని జనసైనికులు తప్పు పడుతున్నారు.

ఒకవేళ కాకినాడలో పోటీ చేసే ధైర్యం లేకుంటే పిఠాపురంలో తనపై పోటీ చేయాలని పవన్ కు సవాల్ చేశారు ముద్రగడ. అయితే గత కొన్నేళ్లుగా ఎన్నికలకు దూరంగా ఉంటున్న ఆయన ఒక్కసారిగా ఎన్నికల్లో పోటీ చెయ్యాలని సవాల్ విసరడానికి చాలా కారణాలే ఉన్నాయి అంటున్నారు పరిణామాలు గమనిస్తున్న వారు. పిఠాపురం అనేది ముద్రగడకు అత్యంత పట్టున్న ఏరియా. మరోవైపు పిఠాపురం నుంచే పవన్ పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు గత కొన్ని నెలలుగా సంకేతాలు వస్తున్నాయి. దీనితో పిఠాపురంలో పోటీ చెయ్యాలని తాజాగా ముద్రగడ సవాల్ చెయ్యడం ఏంటని వారు అంటున్నారు.

ముద్రగడకు ఎన్నికల్లో వైసీపీ తరపున గానీ ఇండిపెండెంట్గా పోటీ చెయ్యాలని ఉందని టాక్ నడుస్తోంది. అయితే అది పవన్ కారణంగానే జరిగిందనే ఫీలర్ జనాల్లోకి వదలాలని ప్రయత్నిస్తున్నట్లు జనసేన చెబుతోంది. పవన్ పై పోటీ చెయ్యాలని వైసీపీ నుంచి ప్రపోజల్ వచ్చేలా కూడా ప్లాన్ చేశారని మరో వాదన ఉంది. తాజాగా రాసిన లేఖతో ఈ ఆరోపణలు మరింత బలపడేలా ఉన్నాయి. దీనివల్ల గెలిస్తే పవన్ పై గెలిచినట్లు క్రెడిట్ దక్కుతుంది. బిగ్ జెయింట్ ను కొట్టారనే రికార్డు నిలిచిపోతుంది. ఓడిపోతే తనను కాపులు మోసం చేశారనే ఆరోపణ చెయ్యడానికి ముద్రగడా రెడీ అయినట్లు పవన్ మద్దతు దారులు ఆరోపిస్తున్నారు.


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *